పిఠాపురం : ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం మరియు పిఠాపురం మహా రాజా కళాశాల మానవీయ శాస్త్రాల విభాగం సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ పట్టణంలో నిర్వహించిన “బోయి భీమన్న పద్య గేయ నాటక సాహిత్యం” పై నిర్వహించిన సాహిత్య సమాలోచన సదస్సులో రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ వైస్ ప్రెసిడెంట్, సోమ సుందర్ లిటరరీ ట్రస్ట్ కోఆర్డినేటర్ యువ సాహితీవేత్త, రచయిత, అసిస్టెంట్ ప్రొఫెసర్, విశ్లేషకుడు డాక్టర్ కిలారి గౌరీ నాయుడికి అభినందన సత్కారం జరిగింది. అభ్యుదయ సాహిత్య నిర్మాణంలో బోయి భీమన్న సాహిత్య కృషి అనే అంశంపై ప్రసంగించి పత్ర సమర్పణ చేశారు. తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రియలు రచన చేసి సామాజిక సాంస్కృతిక చైతన్యాన్ని తీసుకురావడంలో బోయి భీమన్న విశేష కృషి చేశారని గౌరీ నాయుడు తెలిపారు. భారత ప్రభుత్వం బోయ భీమన్న సాహిత్య సేవను గుర్తించి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని గౌరీ నాయుడు గుర్తు చేశారు. పాలేరు నాటకం చదివి ఎంతోమంది యువకులు ఉన్నత స్థానాలను అధిరోహించారని, ఆ నాటకం యువకులలో స్ఫూర్తిని చైతన్యాన్ని నింపిందని గౌరీ నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్, పిఠాపురం రాజా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తిరుపణ్యం, ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగు అధ్యాపక సంఘం గౌరవ అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధిపతి డాక్టర్ తరపట్ల సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు పి.సుబ్బరాజు తదితరులు గౌరీ నాయుడుకి జ్ఞాపిక, ప్రశంసా పత్రం, దుస్సాలువాతో సత్కరించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. స్నేహితులు, కళాకారులు, సాహితీ మిత్రులు, కుటుంబ సభ్యులు గౌరీ నాయుడుకి అభినందనలు తెలిపారు.