contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు మొదలు

ఆంధ్రప్రదేశ్ ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి వారి ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి1వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణకు దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో భాగంగా ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు శనివారం పలు పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. ఆయన వెంట సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు.

పార్కింగ్ ప్రదేశాలతో పాటు సాంస్కృతిక ప్రదర్శన వేదిక, ఏనుగుల చెరువు కట్ట తదితర ప్రదేశాలను వారు పరిశీలించారు. గంగాధర మండపం నుంచి నంది గుడి వరకూ ప్రధాన రహదారికి ఇరువైపుల భక్తులు సేద తీరేందుకు గానూ తాత్కాలిక షెడ్‌లను ఏర్పాటు చేయాలని ఈవో ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ షెడ్లలో గ్రీన్ మ్యాట్లు కూడా ఏర్పాటు చేయాలని తెలిపారు.

ప్రత్యేక క్యూలైన్లు, ప్రధాన రహదారికి ఇరువైపుల సామానులు భద్రపరుచుకునే గది, పాదరక్షలు భద్రపరుచుకునే గదులు ఏర్పాటు చేయాలని, వీటిని వీలైనంత విశాలంగా ఏర్పాట్లు చేయాలన్నారు. క్యూలైన్లకు కుడి వైపున శాశ్వత ప్రాతిపదికన షెడ్లు నిర్మించాలని ఈవో శ్రీనివాసరావు చెప్పారు. వివిధ పార్కింగ్ ప్రదేశాలలో జంగిల్ క్లియరెన్స్ పనులు త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు వెంటనే గ్రావెల్ తోలించి ఆయా ప్రదేశాలను చదును చేసి లెవెలింగ్ పనులు ప్రారంభించాలని తెలిపారు.

పార్కింగ్ ప్రదేశాలతో పాటు వాటి పరిసరాలు అన్నీ శుభ్రంగా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. అన్ని ప్రదేశాలలో ఎక్కువ సంఖ్యలో చెత్తకుండీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలానే మంచినీటి సదుపాయం, తాత్కాలిక విద్యుదీకరణ పనులు చేయాలని చెప్పారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ఎక్కువ సంఖ్యలో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, అలాగే పార్కింగ్ ప్రదేశాలలో ఇతర రద్దీ ప్రాంతాల్లో ప్రధమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

ముఖ్యంగా సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిల్లో సమాచార కరపత్రాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. అయా పార్కింగ్ ప్రదేశాలకు చేరుకోవాల్సిన దారులు, పార్కింగ్ స్థలాలు తెలిపే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఈవో ఆదేశించారు. ప్రముఖులు, అధికారుల వాహనాల నిలుపుదలకు మాడ వీధిలోని కళా ప్రాంగణం వెనుక పార్కింగ్ ప్రదేశం ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పీఎం మురళీ బాలకృష్ణ, ఎం. నరసింహారెడ్డి, పారిశుద్ధ్య విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున రెడ్డి, సివిల్ అండ్ ఎలక్ట్రికల్ విభాగం ఇన్‌చార్జి డీఈఈ పీ చంద్రశేఖర శాస్త్రి, పీవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :