contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

‘అలాంటి సినిమాలను బహిష్కరించాలి’ : అనంత శ్రీరామ్

విజయవాడ : హిందూ ధర్మాన్ని నాశనం చేసే సినిమాలను ప్రతి ఒక్కరూ బహిష్కరించాలని సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ పిలుపునిచ్చారు. అలా చేస్తే అటువంటి సినిమాలకు డబ్బులు రావని, అప్పుడు హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను తీయరని తెలిపారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో గన్నవరం సమీపంలో విశ్వ హిందూపరిషత్‌ ఆధ్వర్యంలో జరిగిన ‘హైందవ శంఖారావం’ సభలో అనంత శ్రీరామ్ మాట్లాడారు. వ్యాస భారతం, వాల్మీకి రామాయణం భారత సాహిత్య వాఙ్మయానికి రెండు కళ్లు లాంటివని పేర్కొన్నారు. అలాంటి వాటినే ఎంటర్​టైన్​మెంట్​ కోసం వక్రీకరించారని అన్నారు. సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి జరుగుతోందంటూ మండిపడ్డారు.

హిందూ ధర్మానికి కళంకం కలుగుతోంది: వ్యాపారాత్మకమైన కళ, కళాత్మకమైన వ్యాపారం మూవీ అని, అయితే ఈ రెండింటినీ కలిపే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలుగుతోందని అన్నారు. దేవాలయాలకు ఆత్మగౌరవం కోసం పెద్ద సంఖ్యలో హిందువులు తరలిరావడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.

క్షమాపణలు చెబుతున్నా: ఫిల్మ్​ ఇండస్ట్రీలో జరిగే తప్పులను ఆ రంగానికి చెందిన వ్యక్తిగా బాహాటంగానే విమర్శిస్తున్నానని, ఇప్పటి వరకు మూవీస్​లో జరిగిన హైందవ ధర్మ హననానికి హిందూ సమాజానికి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. పురాణాలు ఇతి హాసాల గొప్పతనాన్ని మూవీస్​లో తగ్గించి క్యారెక్టర్స్​ మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రను వక్రీకరించి హిందూ ధర్మాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. వాల్మీకి, వ్యాసుడు రచనలను ఎంటర్​టైన్​మెంట్​ కోసం వక్రీకరిస్తున్నారని తెలిపారు.

15 సంవత్సరాలుగా ఆ వ్యక్తికి పాటలు రాయలేదు: కృష్ణా జిల్లాకు చెందిన డైరెక్టర్స్​, ప్రొడ్యూసర్స్ ఈ పొరపాటు చెప్పకపోతే ఎలా అని, పాత్రల ఔన్నత్యాన్ని మారిస్తే హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదని అనంత్ శ్రీరామ్ అన్నారు. నిండు సభలో ద్రౌపది వస్త్రాన్ని తీస్తున్నా మౌనంగా ఉన్న కర్ణుడు గొప్పవాడు ఎలా అవుతారని ప్రశ్నించారు. భారతం, రామాయణం, భాగవతాల్లో పురాణాలను ఇష్టం వచ్చినట్టు మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వక్రీకరణలు, అభూత కల్పనలు చేస్తున్నా మనం చూస్తూ ఊరుకుంటున్నామని అన్నారు.

షూటింగ్​లో, పాటలలో ఎన్నో రకాల అవమానాలు జరిగాయని వ్యాఖ్యానించారు. ఒక డైరెక్టర్​ పాటలో ‘బ్రహ్మాండ నాయకుడు’ అనే పదం ఉండ కూడదని చెబితే 15 సంవత్సరాలుగా ఆ వ్యక్తికి తాను పాటలు రాయలేదని తెలిపారు. హిందూ ధర్మాన్ని అవమానించేలా తీసిన మూవీస్​ని ప్రభుత్వం నిషేధించాలని, లేదంటే హిందువులే పూర్తిగా వాటిని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అప్పుడే హిందూ ధర్మానికి ఒక గౌరవం, గుర్తింపు ఉంటాయని అనంత శ్రీరామ్‌ అన్నారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :