- 516 దేవాలయాలకు పంపిణీ
- రెండు, మూడు నెలలకు సరిపడా సామాగ్రి పంపిణీ
- సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్
ఈ నెల 10న ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని 516 పురాతన దేవాలయాలకు ఉచితంగా పూజా సామాగ్రిని పంపిణీ చేస్తున్నట్లు సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద అధ్యక్షులు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా తమ సంస్థ ఆధ్వర్యంలో ధూప, దీప, నైవేద్యంతో పాటు 33 రకాల పూజా సామాగ్రితో ఒక్కోక్క కిట్ ను తయారుచేసి స్వచ్ఛందంగా పంపిణీ చేస్తున్నామన్నారు.
పురాతన దేవాలయాల్లో ప్రతిరోజు నిత్య పూజకు అవసరమయ్యే అన్ని సామాగ్రిని అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పంపిణీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కర్నూల్, తిరుపతి, నంద్యాల,
కడప తదితర జిల్లాలో పలు పురాతన దేవాలయాలకు ఈ ధూపదీప నైవేద్య కార్యక్రమం సామాగ్రిని పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.
కర్ణాటక, మహారాష్ట్రలో సైతం పంపిణీ
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ 2025 కొత్త సంవత్సరం నుండి కర్ణాటక, మహారాష్ట్రలోని తెలుగు వారు నివాసముండే , ప్రాంతాల్లో, మన తెలుగువారు నిర్వహించే పలు పురాతన దేవాలయాల్లో సైతం నేనుసైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పూజా సామాగ్రిని పంపిణీ చేస్తున్నట్లు ప్రవీణ్ తెలిపారు.
సొంత డబ్బులతోనే…. పంపిణీ
ఈ ధూప దీప నైవేద్యం పంపిణీ కార్యక్రమంలో ఏ ఒక్కరి నుండి ఒక్క రూపాయి చందాలు గాని, విరాళాలు గానీ తీసుకోకుండా తమ సంస్థ సభ్యుల సొంత డబ్బులతో నేనుసైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పురాతన దేవాలయాలకు పూజ సామాగ్రిని పంపిణీ చేస్తున్నానని ప్రవీణ్ తెలిపారు.
గత నాలుగు సంవత్సరాల క్రితం మొదట 11 దేవాలయలతో ప్రారంభమైన ఈ ఉచిత ధూప, దీప నైవేద్యం పంపిణీ కార్యక్రమం నేడు 516 పురాతన దేవాలయాలకు చేరిందని ఆయన తెలిపారు. ప్రతి ఊరిలోని దేవాలయాల్లో దూప, దీప నైవేద్యంతో ప్రతిరోజు పూజలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలోనే దేవాలయంలో పూజారిలకు కానీ, దేవాలయాల కమిటీలకు కానీ ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటే తమను సంప్రదించాలని, 9885282286 నెంబర్ కు ఫోన్ చేస్తే, ఉచితంగా పూజా సామాగ్రిని పంపిణీ చేస్తామని ప్రవీణ్ తెలిపారు.