నల్లగొండ : నల్లగొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ కవితపై వేటు పడింది. గంజి కవితను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కవిత స్థానంలో శ్రీనివాస్ రావుకు పోస్టింగ్ ఇచ్చారు. సమగ్ర విచారణ అనంతరం కవితపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అక్రమాలు, వసూళ్లకు పాల్పడుతున్నారని కవితపై ఆరోపణలు ఉన్నాయి. సొంత సిబ్బంది నుండి సైతం భారీగా వసూళ్లు చేసినట్టు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
గత 15 రోజులుగా కవిత అక్రమాలపై రాష్ట్ర నిఘా విభాగం దృష్టి పెట్టింది. రేషన్, గుట్కా మాఫీయా నుంచి అక్రమ వసూళ్లు, కింది స్థాయి సిబ్బంది వద్ద కూడా చేతివాటం ప్రదర్శించినట్టు నిర్దారణ అయినట్లు సమాచారం. కవిత అక్రమాల్లో ఒక ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుల్స్, ఒక హెడ్ కానిస్టేబుల్ పాలుపంచుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కవిత షాడో టీమ్ పైనా విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నట్లు సమాచారం.
నల్లగొండ జిల్లాకు 2017 సంవత్సరంలో డీఎస్పీ కేడర్ అధికారిగా పోస్టింగ్‌పై వచ్చిన గంజి కవిత ఏడేండ్లుగా ఇక్కడే విధులు నిర్వర్తిస్తూ పదోన్నతులు పొంది బదిలీపై వెళ్లకుండా తన పలుకుబడిని ఉపయోగించి తిష్ఠ వేశారు. ఈ క్రమంలో అనేక అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు ఇతర పోలీస్ అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు మూడు నెలలకు ఒక అధికారిపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు రిపోర్ట్‌లు ఇస్తూ తాను నిజాయితీ గల అధికారిగా వారిని నమ్మించి మన్ననలు పొందుతున్నారని లేఖలో పేర్కొన్నారు. నల్లగొండ, సూర్యాపేట రెండు జిల్లాలకు ఉన్నతాధికారిగా ఉంటూ ప్రభుత్వం నుంచి పోలీస్ సిబ్బందికి వచ్చే అలవెన్స్‌లు, ఇతర గ్రాంట్లను వారికి ఇవ్వకుండా కాజేస్తున్నట్లు ఆరోపించారు. ఇంటెలిజెన్స్ శాఖ నుంచి జిల్లాకు ప్రతి నెలా రూ. 35 వేలు ఎస్‌ఆర్ రూపంలో రెండు జిల్లాలకు కలిసి రూ.70 వేలు కేటాయిస్తుండగా, గత ఐదు సంవత్సరాల నుంచి సిబ్బందికి ఇవ్వకుండా ఆ అధికారే తీసుకుంటున్నట్లు సమాచారం. నాలుగు సంవత్సరాల క్రితం సదరు ఆఫీసర్‌కు బిడ్డ పుట్టడంతో పుట్టిన రోజు సందర్భంగా ఏటా నాలుగు తులాల చొప్పున ఇప్పటివరకు పదహారు తులాల బంగారం రెండు జిల్లాల సిబ్బంది నుంచి వసూలు చేసినట్లు లేఖలో ఆరోపించారు.
ఆ అధికారి కుటుంబ సభ్యులు శ్రీశైలం మార్గంలోని అటవీ ప్రాంతంలో ఒక హోటల్‌ను, ఒక ఆయుర్వేద వైద్యశాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వారం రోజులకు ఒకసారి సిబ్బంది ద్వారా హోటల్‌కు కావాల్సిన సరుకులను నల్లగొండ నుంచే చేరవేస్తున్నట్లు ఆరోపించారు. పదోన్నతులు, పోస్టింగుల పేరుతో సిబ్బంది నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని, వ్యక్తిగత అవసరాలు అంటూ ఎలాంటి కాగితమూ లేకుండా అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సిబ్బందితో సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయిస్తూ పెద్దఎత్తున లాభాలు గడించినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలోనూ ఎక్కడికీ వెళ్లకుండా కేటాయించిన డీజిల్ కాకుండా అదనంగా డీజిల్ వాడినట్లు రసీదులు తెప్పించుకుని బంకుల నుంచి నగదు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల దసరా పండుగ సందర్భంగా సిబ్బందికి ప్రత్యేకంగా టార్గెట్లు పెట్టి మామూళ్లు వసూలు చేశారనే తెలిపారు. పైగా ఆ ఆఫీసర్ తల్లి ట్రాన్స్‌కో కార్యాలయంలో విధులు నిర్వర్తించకుండా నెలకు లక్షన్నర రూపాయల జీతం తీసుకుంటూ వేరొక మహిళను ఏడు వేల రూపాయల వేతనం ఇచ్చి డ్యూటీకి పంపిస్తున్నట్లు ఆరోపించారు. ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయం భవనాన్నే సొంత ఇంటిగా మార్చుకుని ప్రతి నెలా హెచ్‌ఆర్‌ఏ రూపంలో కూడా ప్రభుత్వ సొమ్మును కాజేసినట్లు చెప్పుకొచ్చారు. ఇవే కాకుండా లేఖలో పేర్కొన్న అనేక అంశాలు పోలీస్ శాఖలో కలకలం రేపుతున్నాయి. వాటిపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించి, విచారణ చేస్తున్నట్లు సమాచారం.