నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలంలోని గ్రామాల్లో భూ వివాదాలు పరిష్కారం కాకపోవడంతో ఘర్షణలు తలెత్తున్నాయి. చిన్న చిన్న అంశాలతో ఇరువర్గాలు అటవీకంగా దాడులకు తెగబడుతున్నారు. మాట మాట పెరుగుతున్న ఘర్షణలు రక్తాన్ని కళ్ల చూస్తున్నాయి. ఏకంగా రక్త సంబంధీకులను సైతం లెక్క చేయకుండా హత్య చేసే వరకు చేరుకుంటున్నాయి. పచ్చని పల్లెలు రక్తమోడుతున్నాయి అసలు ఈ వివాదాలకు పరిష్కారం లేదా.. వ్యవస్థలను బలోపేతం చేస్తే చిక్కులు వీడేనా? మండల గ్రామాల్లో ఎన్నో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్న భూ వివాదాలకు ఎక్కడా పరిష్కారం లభించడం లేదు. ఎన్ని మార్గాలు వెతికినా అంతిమంగా ఆక్రమణలు, ఘర్షణలే పరిష్కార మార్గమని సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో దాడులు, రక్త గాయాలు పరిపాటి అయిపోయాయి. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో భూ వివాదాలు హింసాత్మకంగా మారుతున్నాయి. కారణాలు ఏవైనా భూములపై వచ్చే సమస్యలకు పరిష్కాలు చూపకపోవడంతో అటూ అధికార, న్యాయ వ్యవస్థలపై నమ్మకం సన్నగిల్లుతోంది. రెండు వర్గాల మధ్య వచ్చే భూ వివాదానికి ఎక్కడికి వెళ్లినా సత్వర పరిష్కారం లభించకపోవడమే అసలు తగదాలకు కారణమవుతున్నాయని తెలుస్తోంది.
మర్రిపాడు మండలం నాగినేనిగుంట రెవిన్యూ బాట, సింగణపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి సాగు చేసుకొనే విషయంలో రెండువర్గాల మధ్య దాడులు జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకె పొలం సాగు విషయంలో చెలరేగిన వివాదం కాస్తా ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. గ్రామానికి చెందిన 332 వ సర్వే నంబర్లో 2.50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ పొలం విషయంలో ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత కొంత కాలంగా ఒక వర్గం ఆ భూమిని సాగు చేసుకుంటోంది. మరో వర్గం వారు ట్రాక్టర్‌తో భూమిని చదును చేసేందుకు యత్నించగా తాము మొదటి నుంచి సాగు చేస్తున్నామని వారు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల వారు కర్రలతో, రాళ్లతో దాడులకు దిగారు. ఈ దాడుల్లో మహిళలతో సహా మొత్తం 12 మందికి గాయాలయ్యాయి. వాస్తవంగా వివాదం తలెత్తగానే అధికారులను ఆశ్రయిస్తున్నప్పటికీ సత్వరం కాదు కదా తరాలు మారినా భూ వివాదాలు అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. వివాదాలు సుదీర్ఘంగా కొనసాగడానికి రెవెన్యూ చట్టంలో ఉన్న లొసుగులు కూడా కారణమని తెలుస్తోంది. మ్యూటేషన్ విషయంలో సరైన విధానాలు, ప్రభుత్వ భూములను సాగు చేస్తున్నప్పటికి నిలువరించడంలో అధికారులు విఫలమౌతున్నారు. ఇంత జరుగుతున్నా భూ వివాదాల అంశంలో అధికారుల మౌనమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. కొన్ని చోట్ల దాడులతో ఆగుతున్నా మరికొన్ని సార్లు హత్యలు విషాదం నింపుతున్నాయి.
ట్రిబ్యూనల్ వ్యవస్థ బలోపేతంపైనే ఆశలు:
అయితే ఈ భూ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయాలే సరైన పరిష్కారాలు చూపుతాయనే భావన మేధావులు, రైతు సంఘాల ప్రతినిధులు నమ్ముతున్నారు. ట్రిబ్యూనల్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, రెవెన్యూ చట్టాల్లో ఉన్న లోటుపాట్లను సరిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే భూ వివాద దరఖాస్తు స్వీకరించగానే నిర్ణీత వ్యవధిలో పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు. ఆక్రమణల విషయంలో జరగుతున్న ఘర్షణల అంశంలోనూ పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు సమన్వయం చేసుకోవాలని తద్వారా గొడవలు లేకుండా రక్త గాయలకు తావు లేకుండా విలువైన ప్రాణాలు, మానవ సంబంధాలను కాపాడినట్లు అవుతుందని చెబుతున్నారు. భూ వివాదాల పంచాయితీలు అంశంలో సత్వర పరిష్కాలు లభిస్తేనే ఈ దాడులు, హత్యలకు చెక్ పడుతుందని మర్రిపాడు మండల ప్రజలలో అభిప్రాయం వ్యక్తం అవుతోంది. భూవివాద దరఖాస్తు స్వీకరించగానే నిర్ణీత వ్యవధిలో పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు.