హైదరాబాద్ / షాద్ నగర్ : ఆయిల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని రాయకల్ గ్రామ శివారులో గల బీఆర్ఎస్ ఆయిల్ పరిశ్రమలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎడిబుల్ ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్ పేలుడుతో భారీగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న మరో ఆయిల్ ట్యాంకర్ పేలే ప్రమాదం ఉండటంతో కార్మికులు, కంపెనీ నిర్వాహకులు ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో సుమారు 30 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కార్మికులు పరుగులు తీయడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినప్పటికీ అదృష్టవశాత్తు ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ అగ్నిప్రమాదం వల్ల ఎంత మేర నష్టం వాటిల్లింది? ప్రమాదం ఎలా జరిగింది? తదితర విషయాలు తెలియరాలేదు. ప్రమాదంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. భారీ పేలుడుతో అగ్నిప్రమాదం సంభవించినప్పటికీ కార్మికులు అందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.