అమరావతి : ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎన్‌డీఏ కూటమి భాగస్వామ్య నేతలకు చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్, రాజశేఖర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్‌డీఏ పక్షాలతో సమన్వయ సమావేశాలు పెట్టుకుని పనిచేయాలని సూచించారు.
ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందన్నారు. రాత్రికి రాత్రే అన్నీ జరిగిపోతాయని మనం చెప్పట్లేదని పేర్కొన్నారు. గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
కాగా, ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ ఉంటుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉండనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు చొప్పున ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
దీనిలో భాగంగా ఏపీలో ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజక వర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.