- అదుపులోకి తీసుకున్న గన్నేరువరం పోలీసులు
కరీంనగర్ జిల్లా: అక్రమంగా మట్టిని రవాణా చేస్తున్న టిప్పర్ ను గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో గ్రామస్తులు సోమవారం అడ్డుకున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని టిప్పర్ను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా గ్రామస్తుడు హన్మండ్ల నర్సయ్య మాట్లాడుతూ గునుకుల కొండాపూర్ కెనాల్ నుండి వందల ట్రిప్పుల మట్టి జెసిబి యజమానులు కుమ్మక్కై టిప్పర్లు సహాయంతో తిమ్మాపూర్ మండలం రేణికుంట,గన్నేరువరం మండలం గుండ్లపల్లి, బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామాలలోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారని, భూములు కోల్పోయిన గ్రామస్తులు కనీసం ఇంటి నిర్మాణం చేపడితే మట్టి దొరికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్, రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే మట్టి మాఫియా ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్న జెసిపి, టిప్పర్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జెసిబి డ్రైవర్ జెసిబి వాహనంతో పరారయ్యాడు. పోలీసులు జెసిపిని పట్టుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది.