కాగజ్ నగర్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో లారీ చౌరస్తాలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, ఎమ్మెల్సీ దండే విఠల్, శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, “భారతదేశాన, మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన మరాఠా వీరుడిగా పేరు పొందిన ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు . ఆయన ధైర్యం, ప్రజల పట్ల అహకారం లేని పరిపాలన, స్వదేశీ భావన మరియు స్వరాజ్య సాధన కోసం చేసిన కృషి ప్రేరణకరంగా నిలుస్తుంది” అన్నారు.
“చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన కృషిని, సాహసాన్ని, దేశభక్తిని స్మరించుకోవాలి. ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు శివాజీ మహారాజ్ ను ఆదర్శంగా తీసుకుని, ఆయన చూపిన విధంగా దేశం కోసం కృషి చేయాలి” అని దండే విఠల్ అన్నారు.
ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు, స్థానిక ప్రజలు మరియు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.