శ్రీకాకుళం జిల్లా హిర మండలం : పెద్దగూడ పంచాయతీ గిరిజన గ్రామస్తులకు ఇక డోలీ బాధలు తొలగిపోయాయి. పెద్దగూడ పంచాయతీలో తొమ్మిది గిరిజన గ్రామాలు ఉండగా, అవన్నీ ఎత్తయిన కొండ ప్రాంతంలో ఉంటాయి. ఈ గ్రామాలకు ఇంతవరకు పక్కా రహదారి సౌకర్యం లేకపోవడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు.
దీంతో అనారోగ్యంతో బాధపడేవారిని, గర్బిణులను డోలీల్లో నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న కొత్తూరు మండలం గొట్టిపల్లి గ్రామానికి చేర్చేవారు. ఈ గ్రామస్తుల సమస్య శాశ్వత పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం .. పెద్దగూడ పంచాయతీ కేంద్రానికి పక్కా రహదారి ఏర్పాటుకు రూ.1.50 కోట్లు మంజూరు చేయగా, ఇటీవల ఐటీడీఏ ఇంజనీర్లు సీసీ, తారు రోడ్డు పనులు పూర్తి చేశారు.
కాగా, ఆదివారం గ్రామానికి చెందిన గర్బిణి సవర సఖియక అనే మహిళ ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడుతుండటంతో 108కి గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. వెంటనే అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని కొత్తగా వేసిన రహదారి మీదుగా గర్బిణిని 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న కొత్తూరు ఆసుపత్రికి నిమిషాల వ్యవధిలో తరలించారు. గ్రామానికి తొలిసారి అంబులెన్స్ రావడంతో తమకు ఇకపై డోలీ బాధలు తప్పాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.