మహా శివరాత్రి సందర్భంగా దేశంలోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శైవ క్షేత్రాలలో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేశవిదేశాల్లోని ఎత్తైన శివుడి విగ్రహాల వివరాలను పరిశీలిస్తే… ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం రాజస్థాన్ లో ఉంది. రాష్ట్రంలోని నాథ్ ద్వార్ లో 351 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహం పూర్తిగా ఇత్తడితో తయారుచేశారు. చుట్టూ పంటపొలాలు, కొండల మధ్య కూర్చుని ఉన్నట్లు విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
కర్ణాటకలోని మురుడేశ్వర్ లో 123 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం ఉంది. అరేబియా సముద్ర తీరంలో తపస్సు చేసుకుంటున్న రూపంలో శివుడు ఇక్కడ కొలువయ్యాడు. గుజరాత్ లోని వడోదరలో ఏర్పాటు చేసిన శివుడి విగ్రహం ఎత్తు 120 అడుగులు. ఆదియోగి రూపంలో తమిళనాడులోని కోయంబత్తూరులో కొలువై ఉన్న మహాశివుడి విగ్రహం ఎత్తు 112 అడుగులు. సిక్కింలోని నామ్చిలో 108 అడుగుల ఎత్తైన శివయ్య విగ్రహం ఉంది.
హరిద్వార్ లోని స్వామి వివేకానంద పార్క్ లో 100 అడుగుల ఎత్తైన మహాశివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ద్వారకలోని నాగేశ్వర ఆలయంలో 88 అడుగుల ఎత్తైన విగ్రహ రూపంలో మహాశివుడు కొలువై ఉన్నాడు. కర్ణాటకలోని విజయపురిలో 85 అడుగుల ఎత్తైన మహాశివుడి విగ్రహం ఉంది. తమిళనాడులోని కీరమంగళంలో 81 అడుగుల శివుడి విగ్రహం ఉంది. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో 76 అడుగుల ఎత్తైన మహాదేవుడి విగ్రహం ఉంది. బెంగళూరులో యోగముద్రలో ఉన్న శివోహం విగ్రహం ఎత్తు 65.6 అడుగులు.