సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని అశోకా హోటల్ లో బుధవారం రాత్రి కలకలం రేగింది. హోటల్ లో బాంబు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పడంతో టెన్షన్ నెలకొంది. దీంతో స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులు, స్టేషన్ చుట్టుపక్కల ఉన్న చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. హోటల్ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హోటల్ లో ఉన్న వారందరినీ బయటకు పంపించారు. చుట్టుపక్కల బందోబస్తు ఏర్పాటు చేసి అటువైపు ఎవరినీ అనుమతించలేదు.
డాగ్ స్క్వాడ్ ను రప్పించి హోటల్ మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, బాంబు కానీ మరే ఇతర అనుమానాస్పద వస్తువులు కానీ దొరకలేదని చెప్పడంతో హోటల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. బాంబు బెదిరింపు ఆకతాయి పనేనని తేలడంతో స్టేషన్ చుట్టుపక్కల ఉన్న చిరు వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు.