జమ్మూ కాశ్మీర్ లో ప్రజాస్వామ్యం అణచివేతకు గురవుతోందంటూ పాకిస్థాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) మానవ హక్కుల మండలి సమావేశంలో పాక్ ప్రతినిధి, ఆ దేశ మంత్రి అజం నజీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆయన ఆరోపించారు. దీనిని తీవ్రంగా ఖండించిన భారత రాయబారి క్షితిజ్ త్యాగి.. ప్రజాస్వామ్యం విషయంలో భారత్ కు చెప్పేంత సీన్ పాక్ కు లేదని కొట్టిపారేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ నీతి వాక్యాలు వల్లించడం మానుకోవాలని హితవు పలికారు.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాల వల్ల దశాబ్దాలుగా దెబ్బతిన్న జమ్మూకశ్మీర్, లద్దాఖ్ లలో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని క్షితిజ్ త్యాగి చెప్పారు. ఆ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని తేల్చిచెప్పారు. మానవ హక్కుల ఉల్లంఘనకు, మైనారిటీలపై వేధింపులకు పేరొందిన పాకిస్థాన్ ఈ విషయంలో ఉపన్యాసాలు ఇవ్వడం హాస్యాస్పదమని అన్నారు. భారత్ కే కాదు మరే దేశానికీ సలహాలు ఇచ్చే స్థాయి పాకిస్థాన్ కు లేదన్నారు. భారత్ పై అర్థంపర్థంలేని ఆరోపణలు చేయడం మానేసి తమ దేశంలో పరిస్థితిని చక్కదిద్దడంపై, ప్రజలకు సుపరిపాలన అందించడంపై దృష్టిపెట్టాలని త్యాగి హితవు పలికారు.