కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా/ కాగజ్ నగర్ : గత కొన్ని రోజులుగా కాగజ్ నగర్ పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కాగజ్ నగర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బుధవారం, పట్టణంలోని సీతాపతి, బాలాజీ నగర్, పెట్రోల్ పంప్ ఏరియా ప్రాంతాలలో వరుస దొంగతనాలు చేసిన మహమ్మద్ ఖలీల్ (40) మరియు షేక్ ఖలీద్ (30) అనే ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఇద్దరు వ్యక్తులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని పోలీసులు గుర్తించారు. 26వ తేదీ ఉదయం 6 గంటల ప్రాంతంలో, ఎన్టీఆర్ చౌరస్తాలో పోలీసులను చూసి పారిపోవాలని ప్రయత్నించిన నిందితులను, ఇన్స్పెక్టర్ పి. రాజేంద్రప్రసాద్ మరియు ఆయన సిబ్బంది చుట్టుముట్టి పట్టుకున్నారు.
పోలీసులు నిందితుల వద్ద నుండి విస్తృతంగా దొంగతనాలకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటి లో వెండి దీపాలు, వెండి గిన్నెలు, 107 వెండి పుష్పాలు, నగదు రూ. 3700, 88.30 వెండి తులాలు (సుమారు రూ. 79,000 విలువ) మరియు AP 29 J 1011 నెంబర్ గల స్కూటీ వాహనం కూడా ఉన్నాయి. అదేవిధంగా, ఈ నిందితులు ఇతర రాష్ట్రాల్లో 09 దొంగతనాలకు కూడా పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ క్రమంలో, డిఎస్పి బి. రామానుజం, నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్ రాజు, సంపత్, వెంకటేష్ మరియు టౌన్ ఇన్స్పెక్టర్ పి. రాజేంద్రప్రసాద్ ను అభినందించారు.
ఈ సందర్భంగా, డిఎస్పి బి. రామానుజం పట్టణ ప్రజలకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలను పెట్టుకోవాలని సూచించారు. అలాగే, ఊరికి వెళ్ళే ముందు స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని, కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీస్ స్టేషన్ కు సమాచారాన్ని అందించాలని, డయల్ 100 కు కాల్ చేయాలని కోరారు.