పార్టీని ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదని టీడీపీ కేడర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలవాలనే సంకల్పంతో ఇప్పటి నుంచే పని చేయాలని అన్నారు. పార్టీ పునర్నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అని… దానిపై అందరూ దృష్టి సారించాలని చెప్పారు. పార్టీని వదిలేస్తే అందరం మునిగిపోతామని హెచ్చరించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో చంద్రబాబు టీడీఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ మేరకు కీలక సూచనలు చేశారు.
నాయకుల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నానని చంద్రబాబు చెప్పారు. త్వరలోనే ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలను పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడతానని తెలిపారు. నేతలు అందరినీ కలుపుకుని పోవాలని సూచించారు. ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని… అనవసరమైన విషయాల గురించి మాట్లాడితే ప్రతిపక్షం అవకాశంగా తీసుకుంటుందని హెచ్చరించారు.
2019 ఎన్నికల సమయంలో వివేకా హత్య గురించి ‘నారాసుర రక్తచరిత్ర’ అనే పుస్తకాన్ని రాశారని… అదే నిజమని ప్రజలను నమ్మించారని చెప్పారు. వివేకా కూతురు సునీత కూడా అదే నిజమని నమ్మారని… ఆ తర్వాత నిజం తెలుసుకుని కోర్టుకు వెళ్లారని తెలిపారు. ఇటీవల జగన్ ఇంటి వద్ద చెత్త తగలబడితే… దాన్ని కూడా రచ్చ చేయాలని చూశారని… సీసీ కెమెరాల ఫుటేజీ ఇవ్వాలని పోలీసులు అడిగితే చేతులెత్తేశారని చెప్పారు.
ఏప్రిల్ లోపు నామినేటెడ్ పదవులన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పారు. వేసవిలో అతిసార కేసులపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తనతో కలిసి పాత వాళ్లు చాలా మంది ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయాణిస్తున్నారని, వాళ్లకు తన మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసని… కొత్తవాళ్లు కూడా తన గురించి తెలుసుకోవాలని చెప్పారు. అందరూ కలిసి ప్రయాణం చేయాలని సూచించారు.