హైదరాబాద్ : పట్టణ ప్రజలు చాల వరకు చెత్తను ఇంటి ముందు ఉన్న ఉన్న ఖాళీ ప్రదేశంలో పడేస్తుంటారు. కొంతమంది నాలాల్లో వేస్తే ఎవరూ చూడరని అందులో వేస్తుంటారు. ఇక నుంచి అలా చేశారో మీ జేబు గుల్లే. హైదరాబాద్‌లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు, ప్రజల్లో పరిశుభ్రతపై బాధ్యతను పెంచేందుకు జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. చెత్త వేసేవారి ఫోటోలు తీసి భారీ జరిమానాలు వేసేందుకు సిద్దమయింది.
19రకాల ఉల్లంఘనలకు జరిమానాలు : హైదరాబాద్‌లో మొక్కుబడిగా మారిన జరిమానాల విధానాన్ని ఇకపై పక్కాగా అమలు చేయడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి దృష్టిపెట్టారు. ఇకపై ఎక్కడపడితే అక్కడ చెత్తవేస్తే భారీగా జరిమానాలు ఉంటాయని స్పష్టం చేశారు. జరిమానాల విధానం పారదర్శకంగా అమలయ్యేందుకు మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నామని తెలిపారు. తయారీ బాధ్యతలను టీసీఎస్‌కు అప్పగించామని చెప్పారు. అధికారులకు శిక్షణ, యాప్ తయారీ నెలరోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. అనంతరం దానిని ఉపయోగించే విధానంపై అధికారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు చెపుతున్నారు.
అధికారులకు మొబైల్ యాప్ శిక్షణ : పారిశుద్ధ్య విభాగానికి సంబంధించిన జరిమానాల విధింపును సహాయ వైద్యాధికారులు, నిర్మాణ వ్యర్థాలపై ఉండే జరిమానాలను టౌన్ ప్లానింగ్ అధికారులు విధించనున్నారు. అందుకోసం 19 రకాల ఉల్లంఘనలను తెలుపుతూ వాటి జరిమానా విలువను అధికారులు లెక్క తేల్చారు. సర్కిళ్ల వారీగా అధికారులకు లాగిన్లు ఉంటాయి. జరిమానా విధించేటప్పుడు ఉల్లంఘన ఫొటో తీయాలి. అధికారి పేరు, జరిమానా మొత్తం, ఉల్లంఘనుల పేరు, ఫోన్ నెంబరు, చిరునామాతో డిజిటల్ రసీదు వస్తుంది.