జగిత్యాల జిల్లా : మరికొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. పెద్దా చిన్నా అంతా కూడా పెళ్లి పనుల్లో మునిగిపోయారు. ఎంతో సంబురంగా పెళ్లికు ముందు జరిగిన కార్యక్రమాల్లో ఇంట్లో వారంతా సందడి చేశారు. కానీ.. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న ఇళ్లు విషాదంలో మునిగిపోయింది. పెళ్లితో కళకళలాడాల్సి ఇళ్లు కాస్త బంధువుల రోదనలతో నిండిపోయింది. కొద్దిగంటల్లో తమ కుమారుడు ఓ ఇంటి వాడు కాబుతున్నాడని సంబరపడ్డ తల్లిదండ్రులకు శోకమే మిగిలింది. పెళ్లి ఇంట్లో ఏం జరిగింది.. విషాదానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జగిత్యాల జిల్లా వెల్లుల్లలో విషాద ఛాయలు అలముకున్నాయి. పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పచ్చని పందిరిలో అంగరంగ వైభవంగా జరగాల్సి పెళ్లి.. వరుడి ఆత్మహత్యతో బంధువుల రోదనలతో మునిగిపోయింది. అప్పటి వరకు ఆనందంగా గడిపిన ఆ కుటుంబం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేస్తోంది. వెల్లుల్ల గ్రామానికి చెందిన కిరణ్‌కు వారం క్రితమే నిశ్చితార్థం జరిగింది. రేపు (ఆదివారం) ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లికి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. రెండు మూడు రోజుల క్రితమే కిరణ్ ఫోటో షూట్‌కు కూడా వెళ్లాడు.
అంతాబాగానే ఉందనుకున్న సమయంలో మరో 24 గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు కిరణ్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమ్మాయి తరపు, అబ్బాయి తరపు అంతా బాగానే ఉందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే కిరణ్‌ను ఎవరైనా ఎగతాలి చేశారా లేక ఇంకేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. వరుడి బలవన్మరణంతో రెండు కుటుంబాల్లో కూడా విషాదఛాయలు అలముకున్నాయి. మరికొద్దిగంటల్లో పెళ్లిపీటలపై కూర్చోవాల్సిన వరుడు కిరణ్ ఇలా సూసైడ్ చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.