అమెరికా అధికారులు తుర్క్‌మెనిస్థాన్‌లోని పాకిస్థాన్ రాయబారి కె.కె. ఎహ్సాన్ వాగన్‌ను లాస్ ఏంజెలెస్‌లో ప్రవేశించకుండా నిలిపివేశారు. సరైన వీసా, ప్రయాణ పత్రాలు ఉన్నప్పటికీ ఆయనను తిప్పి పంపినట్లు సమాచారం. ఈ సంఘటన దౌత్యపరంగా చర్చనీయాంశమైంది.
ఎహ్సాన్ వాగన్ సెలవుల నిమిత్తం లాస్ ఏంజెలెస్‌కు వెళుతుండగా విమానాశ్రయంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారని ‘ది న్యూస్’ పత్రిక పేర్కొంది. ఆయన వీసాలో కొన్ని వివాదాస్పద అంశాలను గుర్తించడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, అమెరికా దీనిపై ఇంకా స్పష్టమైన కారణాలు వెల్లడించలేదు.
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఈ విషయంపై స్పందిస్తూ, లాస్ ఏంజెలెస్‌లోని కాన్సులేట్‌ను విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వాగన్‌ను ఇస్లామాబాద్‌కు పిలిపించే అవకాశం ఉంది. వాగన్ గతంలో ఖాట్మండులోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో సెకండ్ సెక్రటరీగా, లాస్ ఏంజెలెస్‌లోని పాకిస్థాన్ కాన్సులేట్‌లో డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా కూడా పనిచేశారు.
ఈ ఘటనకు దౌత్యపరమైన కారణాలు లేవని, గతంలో వాగన్ అమెరికాలో పనిచేసినప్పుడు వచ్చిన ఫిర్యాదుల వల్ల జరిగి ఉండవచ్చని పాకిస్థాన్ మీడియా వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే పాకిస్థాన్‌పై అమెరికా కొత్త ప్రయాణ నిషేధం విధించే అవకాశం ఉందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ గతవారం తెలిపింది.