ఆంధ్రప్రదేశ్ శాసనసభలో విద్యుత్ రంగంపై లఘు చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా విద్యుత్ వినియోగం ఆధారంగానే ప్రజల అభివృద్ధిని లెక్కిస్తారన్నారు. కొన్నేళ్లుగా విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మర్పులు వచ్చాయని సీఎం తెలిపారు. గతంలో కరెంటు కోతల సమయంలో రైతుల అవస్థలు ప్రత్యక్షంగా పరిశీలించానని గుర్తు చేశారు. రైతుల ఇబ్బందులు చూశాక పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించుకున్నామన్నారు.
విద్యుత్ సంస్కరణలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తే ప్రపంచ బ్యాంకు జీతగాడని అవహేళన చేశారన్నారు. అప్పుడే డిస్కమ్‌లు, నియంత్రణ మండలి, ఎనర్జీ ఆడిటింగ్ అనేది మొదలు పెట్టామన్నారు. గతంలో ట్రాన్స్మిషన్ నష్టాలు 23 శాతం అని, దేశంలో తొలిసారి నిర్ధారించింది కూడా ఏపీనేనని సీఎం అన్నారు. విభజన తర్వాత కరెంటు కోతలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దామన్నారు.
టీడీపీ హయాంలో చేసిన విద్యుత్ సంస్కరణలు వాడుకుని అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్టీపీఎస్ లాంటి ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను 83 శాతం పీఎల్‌ఎఫ్‌తో నడిపించామని తెలిపారు. చాలా ప్రైవేటు సంస్థలకూ అది సాధ్యం కాదని అన్నారు. ఈ పరిపాలనా మార్పులు ప్రజలు గుర్తించాలన్నదే తమ అభిప్రాయమని సీఎం అన్నారు.
ఇప్పటి వరకూ ఎక్సైజ్, మైనింగ్, పెట్రోల్, డీజిల్ లాంటి వాటితోనే రాష్ట్రానికి ఆదాయం వచ్చేదని, ఇప్పుడు విద్యుత్‌తో కూడా రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అదే సమయంలో ప్రజలకూ భారం ఉండకూడదన్నది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మొత్తం 160 గిగావాట్ల మేర పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్ రంగంలోనే ఇప్పటికి 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, తద్వారా 3.70 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.
ఏపీలోనూ సౌర విద్యుత్ ఫలకాల ఉత్పత్తిపైనా ప్రభుత్వం దృష్టి పెట్టిందని వివరించారు. సోలార్ మాడ్యూల్స్ ఉత్పత్తి కోసం వచ్చే పరిశ్రమలకూ పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. విద్యుత్ భారం తగ్గించడానికి కరెంటు స్వాపింగ్ అనే విధానానికి కూడా స్వీకారం చుట్టామన్నారు. 600 మెగావాట్ల విద్యుత్ ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి స్వాపింగ్ ద్వారా వస్తోందని వెల్లడించారు. విద్యుత్ స్వాపింగ్ ద్వారా రోజూ 7 కోట్ల రూపాలయలకు పైగా ఆదా అవుతోందని చెప్పారు. సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టు ఏపీకి గేమ్ చేంజర్ అని అన్నారు.