మహారాష్ట్ర: ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో ఉన్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని వెంటనే తొలగించాలని వీహెచ్ పీ, భజరంగ్ దళ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం వెంటనే ఈ పని చేయకపోతే జిల్లాలో బాబ్రీ తరహా ఘటన చోటుచేసుకుంటుందని హెచ్చరించాయి. 1992లో కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చేసినట్టు ఔరంగజేబ్ సమాధిని తాము తొలగిస్తామని స్పష్టం చేశాయి. ఈ విషయంలో ఫడ్నవీస్ సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. వీహెచ్ పీ, భజరంగ్ దళ్ హెచ్చరికల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా కుల్దాబాద్ లో ఉన్న ఔరంగజేబ్ సమాధి వద్ద సెక్యూరిటీని పెంచింది.
ఔరంగజేబ్ సమాధి నాటి వెట్టి చాకిరీకి, బానిసత్వానికి, మొఘలుల పాలనలో హిందువులపై జరిగిన వేధింపులకు చిహ్నమని వీహెచ్ పీ, భజరంగ్ దళ్ స్థానిక నేతలు కిషోర్ చవాన్, నితిన్ మహాజన్, సందేశ్ భెగ్డేలు ఆరోపించారు. ఈ సమాధిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లు, తహసీల్దార్ కార్యాలయాల ముందు ఆందోళనలు చేపడతామని, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు ఈమేరకు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. కాగా, ఔరంగజేబ్ సమాధిని తొలగించాలన్న డిమాండ్ కు శివసేన (ఏక్ నాథ్ శిండే వర్గం) మద్దతు తెలిపింది. ప్రజలను వేధింపులకు, అణచివేతకు గురిచేసిన పాలకుడి సమాధిని ప్రత్యేక భద్రత పెట్టి మరీ కాపాడాల్సిన అవసరం ఏంటని మంత్రి సంజయ్ శిర్సత్ ప్రశ్నించారు.