జమ్ముకశ్మీర్ : ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు పాకిస్థాన్ పౌరుల వీసాలను రద్దు చేసింది. వెంటనే భారత్‌ను వీడాలని పాక్ పౌరులను ఆదేశించింది. మెడికల్ వీసాదారులు 29వ తేదీలోపు భారత్ వీడాలని స్పష్టం చేసింది.
భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర రూపం దాల్చిన ఉద్రిక్తతలు పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. గురువారం నాడు ట్రేడింగ్‌లో కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ కీలక సూచీ KSE 100 భారీగా పతనమైంది. పాక్ స్టాక్ మార్కెట్ దాదాపు 2 శాతం నష్టపోయింది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్‌కు ఈ పరిణామం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన ఘటన అనంతరం భారత్ కఠిన వైఖరి అవలంబించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భేటీ అయిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడంతో పాటు, ఇరు దేశాల్లోని దౌత్య సిబ్బందిని గణనీయంగా తగ్గించాలని, పాక్ మిలిటరీ అటాషెలను బహిష్కరించాలని నిర్ణయించింది. పాక్ జాతీయులకు సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని నిలిపివేసింది. మే 1వ తేదీలోగా చట్టబద్ధంగా తిరిగి వచ్చేవారు మినహా, తక్షణమే అట్టారీ సరిహద్దును మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
భారత్ చర్యలకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ నేడు కరాచీ తీరంలో క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. భారత్‌లోని ప్రధాన నగరాలకు చేరగల సామర్థ్యం ఉన్న షహీన్-III లేదా బాబర్ క్షిపణిని పరీక్షించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో భారత్ కూడా తన సరికొత్త గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ నుంచి మీడియం రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించింది.
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగానే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నదని ఆరిఫ్ హబీబ్ లిమిటెడ్‌కు చెందిన సనా తౌఫిక్, తదితర విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్య నిధి పాకిస్తాన్ వృద్ధి రేటు అంచనాలను 2025 ఆర్థిక సంవత్సరానికి గాను 3 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గించడం కూడా మార్కెట్‌పై ఒత్తిడి పెంచిందని నిపుణులు పేర్కొన్నారు.