స్వైన్‌ఫ్లూ, కరోనా వ్యాధి లక్షణాలు ఒకే విధంగా ఉండటం, భారత్ నుంచి చైనాకు..ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చిపోతున్న ప్రయాణికుల సంఖ్య భారీగానే ఉండటం, కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి విస్తరించే ప్రమాదం ఉండటంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. స్వైన్‌ఫ్లూ జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి చేరుకుంటున్న బాధితులకు గురువారం నుంచి హెచ్1 ఎన్1 పరీక్షలతో పాటు కరోనరి వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా బాధితుల నుంచి నమూనాలు సేకరించి ఆస్పత్రి మైక్రోబయాలజీ విభాగంలోని వైరాలజీల్యాబ్‌లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. గ్రేటర్‌లోనూ కరోనా ఫీవర్ భయం పట్టుకుంది. గత కొద్ది రోజులుగా చైనీయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ‘కరోనా’ వైరస్ నగరానికి విస్తరించే అవకాశం ఉండటంతో ప్రస్తుతం నగరవాసుల్లో ఆందోళన మొదలైంది. చైనాలో ఇప్పటికే 440 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడం, వీరిలో ఇప్పటికే తొమ్మిది మంది వరకు చనిపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )