కార్చిచ్చు వల్ల నెలకొన్న కాలుష్యానికి తోడు భారీ వర్షం ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలి రోజు పోటీలకు తీవ్ర ఆటంకం కలిగించింది. షెడ్యూలు ప్రకారం మొదటి రోజు జరగాల్సిన 64 మ్యాచ్‌ల్లో 18 మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. రూఫ్‌లను మూసి కొన్ని మ్యాచ్‌లను నిర్వహించారు. మరికొన్ని మ్యాచ్‌లు మంగళవారానికి వాయిదా పడ్డాయి. మహిళల సింగిల్స్‌లో 24వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ వేటలో ఉన్న సెరెనా విలియమ్స్ కేవలం 58 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించింది. సెరెనా 6-0, 6-3తో అనస్తాసియా పొటపొవా (రష్యా)ను ఓడించింది. రెండో రౌండ్లో సెరెనా.. జిడాన్‌సెక్ (స్లోవేనియా)తో తలపడనుంది. తల్లి కాకముందు మూడేళ్ల క్రితం చివరిసారిగా గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన సెరెనా.. ఈ టోర్నీతో ఎప్పటి నుంచో ఊరిస్తున్న మార్గరెట్ కోర్ట్ రికార్డును అందుకోవాలని పట్టుదలగా ఉంది.
డిఫెండింగ్ చాంపియన్ నవోమీ ఒసాకా (జపాన్) 6-2, 6-4తేడాతో మరే బౌజ్‌కోవాపై గెలిచింది. టాప్ సీడ్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 5-7, 6-1, 6-1తేడాతో సురెంకో (ఉక్రెయిన్)పై గెలిచింది. ఏడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత వీనస్ విలియమ్స్ (అమెరికా)కు 15 ఏళ్ల కోరీ గాఫ్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో షాకిచ్చింది. అమెరికాకే చెందిన యువ సంచలనం గాఫ్ 7-6(7/5), 6-3తేడాతో వరుస సెట్లలో వీనస్‌ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) 6-3, 6-2, 6-2తో స్టీవ్ జాన్సన్ (అమెరికా)పై అలవోక విజయం సాధించాడు. రెండో సీడ్ నోవాక్ జొకోవిచ్ (సెర్బియా) 7-6 (7/5), 6-2, 2-6, 6-1తో జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)పై శ్రమించి గెలిచాడు. భారత టాప్ ర్యాంక్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తొలి రౌండ్ మ్యాచ్ మంగళవారానికి వాయిదా పడింది. జపాన్ ప్రత్యర్థి తత్సుమా ఇటోతో సోమవారం జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం వల్ల ఈరోకి వాయిదా పడింది. జపాన్ ప్లేయర్‌పై గెలిస్తే.. ప్రజ్నేశ్‌కు రెండో రౌండ్లో జొకోవిచ్ ఎదురుపడనున్నాడు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference