ఐపీఎస్ అధికారుల డిప్యుటేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే దిశగానే కేంద్రం అడుగులు వేస్తోంది. రాష్ట్రాలు NOC ఇచ్చినా ఇవ్వకపోయినా…….. SP, DIG స్థాయిలో ఐపీఎస్ అధికారులు తప్పనిసరిగా కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్ తీసుకునేలా హోంశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ ఫైల్ ఇప్పుడు PMOకి కూడా చేరింది. SP, DIG స్థాయిలో డిప్యూటేషన్‌కు వెళ్లకుంటే.. అలాంటి వారికి భవిష్యత్తులో కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లే అర్హత ఉండదు. కేంద్రంలో ప్రస్తుతం SP, DIG స్థాయిలో ఆఫీసర్ల కొరత తీవ్రంగా ఉంది. వివిధ కేంద్ర పోలీస్ ఆర్గనైజేషన్లు, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో ఖాళీలు భారీగా ఉన్నాయి.
SP, DIG స్థాయిలో 50 శాతం పైగా ఖాళీలు ఉన్నాయని హోంశాఖ చెప్తోంది. CBI, IB లాంటి ఏజెన్సీల్లో పనిచేసేందుకు DIG, SP ర్యాంక్ వాళ్లను డిప్యుటేషన్‌పై తీసుకుంటున్నారు. పారామిలటరీ ఫోర్సెస్‌లో ఇతర శాఖల్లో పనిచేసేందుకు మ్యాన్ పవర్ లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఆ సమస్య పరిష్కరించడానికే డిప్యుటేషన్ తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయి వచ్చే వరకు డిప్యుటేషన్‌పై వెళ్లే అవకాశం ఉంది. IG స్థాయికి చేరుకునేసరికి మూడేళ్ల పాటు డిప్యుటేషన్ ఉండాల్సిందేనని, లేదంటే సెంట్రల్ డిప్యుటేషన్ ఎంపానెల్మెంట్కు అర్హులు కాదంటూ కేంద్ర హోంశాఖ ప్రతిపాదిస్తోంది.
IAS, IPS, IFS సర్వీస్ రూల్స్‌లో మార్పులపై.. ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్రాలకు పంపింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి ఉన్నా.. లేకపోయినా.. IAS, IPS అధికారులను డిప్యుటేషన్‌పై తీసుకునేందుకు వీలుగా ఈ రూల్స్ మార్చారు. ఐతే.. ఈ కేంద్రం ప్రతిపాదనలను పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. గతంలో తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో డిప్యుటేషన్లు పెద్ద వివాదానికే కారణం అయ్యాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి. కేంద్రం ప్రతిపాదనలు వ్యతిరేకిస్తూ ఇప్పటికే కేసీఆర్ సహా పలువులు సీఎంలు లేఖలు కూడా రాశారు.. ఐతే.. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ముందుకు వెళ్లే సూచనలే కనిపిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.