తెరాస ప్రభుత్వంపై ఆ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజుల వ్యవధిలోనే రెండో సారి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తమిళిసై సోమవారం ఢిల్లీలోనే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో ఏనాడూ టీఆర్ఎస్ సర్కారుపై చేయనంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలపై కేంద్రం తన పని తాను చేసుకుపోతుందని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ… ‘నేను రాజకీయం చేస్తున్నానని అనవసరంగా విమర్శిస్తున్నారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా విమర్శించారు. పాత వీడియోలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలపై కేంద్రం తన పని తాను చేసుకుపోతుంది. నేను ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని అనలేదు. ఇతర రాష్ట్రాల్లో గవర్నర్‌తో విభేదాలున్నా.. రాజ్ భవన్‌ను గౌరవిస్తున్నారు’ అంటూ గవర్నర్ వ్యాఖ్యానించారు