పులివెందుల: సీఎం జగన్ సమీప బంధువు, పులివెందుల నియోజకవర్గం పరిధిలోని చక్రాయపేట మండలం వైకాపా ఇన్‌ఛార్జి వైఎస్ కొండారెడ్డిని కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
పులివెందుల- రాయచోటి రోడ్డు పనులు చేస్తున్న ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్ సంస్థ కాంట్రాక్టర్‌ను కొండారెడ్డి బెదిరించినట్లు చక్రాయపేట పోలీసులకు ఫిర్యాదు అందింది. చక్రాయపేట మండలంలో పనులు చేయాలంటే డబ్బులివ్వాలని డిమాండ్ చేసినట్లు కాంట్రాక్టర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కర్ణాటకలోని ఓ భాజపా నేతకు చెందిన ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్ సంస్థ.. కొండారెడ్డి బెదిరిస్తున్నట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన జగన్ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. అనంతరం కొండారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు.. అతని కాల్‌డేటాను పరిశీలించారు. కాంట్రాక్టర్‌ను బెదిరించినట్లు గుర్తించారు. నిందితుడిని ఈ ఉదయం 11గంటల ప్రాంతంలో అరెస్టు చేసి లక్కిరెడ్డిపల్లె కోర్టులో హాజరుపరిచినట్లు కడప ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. కోర్టు రిమాండ్ విధించడంతో కడప జైలుకు తరలించినట్లు ఆయన వివరించారు.
