వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వారణాసిలోని స్థానిక కోర్టు ఈ కేసును విచారించకుండా సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు అత్యున్నత న్యాయస్థానం ఈ కేసులో వాదనలు విననున్నట్టు ప్రకటించింది.
జ్ఞానవాపి మసీదులో సర్వే చేస్తుండగా వజు ఖానా (ముస్లింలు కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు ఉద్దేశించిన నీటి గుండం)లో శివలింగం బయటపడడం తెలిసిందే. దీని రక్షణకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కేసును విచారిస్తున్న స్థానిక కోర్టు లోగడ ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు సైతం ముస్లింలు తమ ప్రార్థనలు కొనసాగించుకోవచ్చని, అదే సమయంలో వజు ఖానా వద్ద భద్రత కల్పించాలని రెండు రోజుల క్రితం ఆదేశించింది.
నేడు విచారణ సందర్భంగా ‘‘ఏర్పాట్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ట్రయల్ కోర్టును ఆదేశిస్తున్నాం. ఈ వ్యాజ్యంలో తదుపరి చర్యలు తీసుకోకుండా నిరోధిస్తున్నాం. ఈ అంశంపై రేపు ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారణ నిర్వహిస్తుంది’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
మరోవైపు కోర్టు ఆదేశాల నేపథ్యంలో జ్ఞానవాపి మసీదు – కాశీ విశ్వనాథ్ టెంపుల్ కాంప్లెక్స్ వద్ద శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా సీఆర్పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. వజు ఖానాకు వెళ్లే డోర్ వద్ద జవాన్లు మోహరించారు. సీఆర్పీఎఫ్ కమాండెంట్, డిప్యూటీ ఎస్పీ ర్యాంక్ ఆధ్వర్యంలో రక్షణ ఏర్పాట్లు చేశారు.