మెట్పల్లి, జగిత్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయ అన్యాయం జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు ఆరోపించారు. మెట్పల్లి పట్టణంలోని జువ్వాడి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పలు రాజకీయ అంశాలపై మాట్లాడారు.
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేయించడం ఎంతవరకు సమంజసమని జువ్వాడి నర్సింగరావు ప్రశ్నించారు. రాజకీయ అనుభవం లేకుండానే ఎమ్మెల్యేగా ఎన్నికైన సంజయ్ మాట్లాడుతున్న తీరు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోందని విమర్శించారు.
ఎమ్మెల్యే సంజయ్‌ను “జాక్‌పాట్ ఎమ్మెల్యే”గా అభివర్ణించిన ఆయన, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల నేపథ్యంలో జరిగిన రాజకీయ పరిణామాల వల్లే ఆయన విజయం సాధించారని ఆరోపించారు. అయితే అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు.
వారాంతాల్లో మాత్రమే నియోజకవర్గానికి వచ్చే “వీకెండ్ ఎమ్మెల్యే”గా సంజయ్ మారిపోయారని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం కంటే మీడియా ప్రచారం కోసం తరచూ ప్రెస్మీట్లు నిర్వహించడం తప్ప నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని విమర్శించారు.
మెట్పల్లి క్లబ్‌ను విక్రయించిన ఘనత కూడా ఎమ్మెల్యేకే దక్కుతుందని ఆరోపించిన జువ్వాడి, అద్దెకు తెచ్చుకున్న గుండాలతో రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయిస్తున్నారని అన్నారు. అవినీతికి పాల్పడుతూ ఇతరులపై అవినీతి ఆరోపణలు చేయడానికి నైతిక హక్కు ఎమ్మెల్యేకు లేదని మండిపడ్డారు.
“పరాన్నజీవి” అనే పదానికి ఎమ్మెల్యేకు అసలు అర్థం తెలుసా అని ప్రశ్నించిన ఆయన, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో 70 శాతం మంది పరాన్నజీవులేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలతో సస్పెండ్ అయిన వ్యక్తి మీ తండ్రి కాదా అని ప్రశ్నిస్తూ ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు.
ప్రజా సమస్యలపై రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు అతీతంగా స్పందించాలని, ఆవేశంతో కాకుండా ఆలోచనతో పనిచేస్తూ ప్రజలకు సేవ చేయాలని జువ్వాడి నర్సింగరావు సూచించారు.








