సికింద్రాబాద్ లో అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మక రూపుదాల్చడం తెలిసిందే. దీనిపై మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) స్పందించింది. మీడియా కథనాలను హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ఆర్పీఎఫ్, జీఆర్పీ, డీజీపీలను ఆదేశించింది. నివేదిక అందించేందుకు జులై 20వ తేదీని తుది గడువుగా నిర్దేశించింది.
నిన్న సికింద్రాబాద్ లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సైన్యంలో నియామకాల కోసం తీసుకువస్తున్న అగ్నిపథ్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ, నిరసనకారులు విధ్వంసానికి దిగారు. పలు రైళ్లకు నిప్పుపెట్టారు. రైల్వే ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసు బలగాలు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో 14 మంది గాయపడగా, వారిలో దామెర రాకేష్ అనే యువకుడు మరణించాడు. మిగిలిన వారు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.