సినీ కార్మికుల డిమాండ్ల అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ తెలిపారు. ఇటు సినీ కార్మికులు, అటు నిర్మాతలతో చర్చలు జరిపేందుకు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో సమన్వయ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ సమన్వయ కమిటీకి నిర్మాత దిల్ రాజు అధ్యక్షత వహిస్తున్నారు. ఇవాళ ఆయన మీడియా ముందుకు వచ్చారు.
ఇరువర్గాలతో చర్చలు మొదలయ్యాయని, ఆరోగ్యకర వాతావరణంలో సమస్యలపై చర్చిస్తున్నామని వెల్లడించారు. అన్ని అంశాలు ఓ కొలిక్కి వచ్చాక, తాము ఏ నిర్ణయానికి వచ్చామన్నది మీడియాకు ప్రకటిస్తామని దిల్ రాజు పేర్కొన్నారు. ఇవన్నీ కూడా తేలిపోయే మేఘాల్లాంటివని, కార్మికుల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు అన్న తేడా లేదని, చర్యల సందర్భంగా ఎవరి సమస్యలు వారు చెబితే, దానిపై అందరం కలిసి మాట్లాడుకుని అంతిమ నిర్ణయాన్ని వెలువరిస్తామని అన్నారు. చర్చలకు నిర్దిష్ట గడువు అంటూ లేదని, జరుగుతుంటాయని తెలిపారు.