టీడీపీ హయాంలో కృష్ణా కరకట్టపై నాటి సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంటి సమీపంలో నిర్మించిన ప్రజా వేదికను వైసీపీ ప్రభుత్వం కూల్చివేసి నేటితో సరిగ్గా మూడేళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో ప్రజా ధనంతో కట్టిన ప్రజా వేదికను కూల్చివేసిన జగన్ సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు ప్రజా వేదిక వద్ద నిరసనలకు సిద్ధమయ్యాయి. ఇందుకోసం గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకుంటున్నాయి.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు ప్రజా వేదిక కూల్చివేత ప్రాంతం వద్దకు భారీగా చేరుకున్నారు. ఇప్పటికే కరకట్టపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న పోలీసులు చంద్రబాబు నివాసం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. అటు దిశగా ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.