ఆంధ్రప్రదేశ్ రహదారుల దుస్థితిపై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు జనసేన కూడా వినూత్న నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రారంభమైన జనసేన ప్రచారం ఇంకా కొనసాగుతుండగా… ఏపీలో ఆ పార్టీతో పొత్తులో కొనసాగుతున్న బీజేపీ కూడా తాజాగా రోడ్ల దుస్థితిపై ప్రచారం మొదలుపెట్టింది. జనసేన మాదిరే కార్టూన్లతో బీజేపీ తన ప్రచారానికి శ్రీకారం చుట్టింది.
శుక్రవారం సోషల్ మీడియా వేదికగా బీజేపీ ఓ సెటైరికల్ కార్టూన్‌ను సంధించింది. ‘జగన్ రోడ్లు- నరకానికి దారులు’ పేరిట మొదలుపెట్టిన ఈ ప్రచారంలో భాగంగా ‘వైసీపీ ప్రభుత్వ సిత్రాలు… రాష్ట్ర రోడ్లు’ అంటూ ఓ కార్టూన్‌ను పోస్ట్ చేసింది. ఈ కార్టూన్ లో విజయవాడకు 5 కిలో మీటర్ల దూరంలో కారులో వెళుతున్న ఓ వ్యక్తి.. రోడ్డు పక్కగా కూర్చుని మద్యం తాగుతున్న ఓ వ్యక్తిని ‘ఈ రోడ్డు ఎక్కడికి వెళుతుంది’ అని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా… ‘ఏముంది? డైరెక్ట్‌గా పైకే’ అంటూ సమాధానం ఇస్తాడు. అంతేకాకుండా ‘ఈ రోడ్డు ఎక్కడికి పోతుందో తెలియదు గానీ… నీ కారేమో షెడ్డుకు, నువ్వేమో హాస్పిటల్‌కి మాత్రం పక్కాగా వెళతారు’ అంటూ సెటైర్ సంధిస్తాడు.
జగన్ రోడ్లు – నరకానికి దారులు pic.twitter.com/c0XKVRYaLO
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) August 19, 2022