దేశ రాజధాని ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధం ఉందంటూ ఆరోపించిన బీజేపీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాలపై పరువు నష్టం దావా వేయనున్నట్టు తెలుస్తోంది. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆమె న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
ఈ ఆరోపణలపై ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై మండిపడ్డారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని… ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కేసీఆర్ కూతురుని కాబట్టే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ భయపడరని అన్నారు. తమ కుటుంబ గౌరవాన్ని దెబ్బతీయాలని అనుకుంటున్నారని చెప్పారు.