హైదరాబాద్ లో పాతబస్తీలో హై టెన్షన్ నెలకొంది. అర్ధరాత్రి ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తమ మనోభావాలను కించపరిచేలా మాట్లాడారంటూ ఎంఐఎం కార్యకర్తలు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలను ఖండిస్తూ పాతబస్తీలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం అక్కడే భైఠాయిచారు. ఎమ్మెల్యే రాజాసింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. అయితే ఆ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా రాజాసింగ్ మాట్లాడారని ఎంఐఎం నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తమ మనోభావాలను దెబ్బతీసిన రాజాసింగ్ ను అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్లను ముట్టడించారు.భారీగా ఆందోళనలు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్న రాజాసింగ్ పై యాక్షన్ తీసుకోవాలని నినాదాలు చేశారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవాలని చూసినా.. వాళ్లను తోసుకుంటూ పోలీస్ స్టేషన్ లోకి దూసుకొచ్చారు ఎంఐఎం కార్యకర్తలు. ఈ సందర్భంగా పలు పోలీస్ స్టేషన్లలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ తో పాటు పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనకారులు స్లోగన్స్ చేశారు. బషీర్‌బాగ్‌లోని సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీసు ఎదుట కూడా ధర్నా చేశారు.
భవానీ నగర్, డబీర్ పురా, రెయిన్ బజార్ స్టేషన్ లో ఎంఐఎం నేతలు ఫిర్యాదులు చేశారు. మలక్ పేట ఎమ్మెల్యే బలాలా డబీర్ పురా పిఎస్ కు వెళ్లి నిరసనకారులతో కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు డబీర్ పురా పోలీస్ స్టేషన్ లో రాజా సింగ్ పై కేస్ నమోదైందని సౌత్ జోన్ డీసీపీ సాయిచైతన్య తెలిపారు. ఎంఐఎం ఆందోళనలతో పాతబస్తీలో హై టెన్షన్ కొనసాగుతోంది. అదనపు బలగాలను మోహరించారు. ఉన్నతాధికారులను పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తన వీడియో వివాదాస్పదం కావడంతో తన యూట్యూబ్ ఛానెల్ నుంచి ఆ వీడియోను డిలీట్ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.