మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్, కోర్టులో ఆయనను హాజరుపరచడం, కోర్టు వద్ద కూడా రాజా సింగ్ అనుకూల, వ్యతిరేక వర్గాల నిరసనలతో మంగళవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతల మధ్యే రాజా సింగ్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆ వెంటనే ఆయనకు కోర్టు 14 రోజుల పాట రిమాండ్ విధించిందని, పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారని వార్తలు వినిపించాయి.
అయితే ఆ వార్తలన్నీ అవాస్తవమని తేలిపోయింది. రాజా సింగ్‌ను రిమాండ్‌కు పంపాలంటూ పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఓ వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే 41ఏ సీఆర్పీసీ సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాల్సి ఉందని, అయితే రాజా సింగ్‌కు అలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారంటూ కోర్టు పోలీసులను తప్పుబట్టింది. అదే సమయంలో రాజా సింగ్ తరఫు న్యాయవాదులు కూడా తమ క్లయింట్‌కు జరిగిన అన్యాయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఇటు ప్రభుత్వ లాయర్లు, అటు రాజా సింగ్ లాయర్ల మధ్య దాదాపుగా 45 నిమిషాల పాటు తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు కొనసాగాయి.
రాజా సింగ్‌ను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు సావదానంగా విన్న న్యాయమూర్తి… రాజా సింగ్ రిమాండ్ రిపోర్ట్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆయనను తక్షణమే విడుదల చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. రాజా సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన తీరు బాగా లేదని కూడా ఈ సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నట్లు సమాచారం. వెరసి మరికాసేపట్లోనే రాజా సింగ్ పోలీసుల చక్రబంధం నుంచి విడుదల కానున్నారు.