ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ శనివారం స్పందించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో శనివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మాట్లాడిన ఆయన మతాల పేరిట జరుగుతున్న గొడవలపై స్పందించారు. మతాల పేరు చెప్పుకుని కొట్టుకోమని ఏ దేవుడు చెప్పాడంటూ ఆయన ప్రశ్నించారు. నీళ్లు లేక కొందరు, తిండి లేక చాలా మంది అల్లాడుతుంటే…వాటి పరిష్కారం వదిలేసి అనవసర విషయాలపై రాద్ధాంతం చేయడం అవసరమా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
8 ఏళ్ల పాలనలో తెలంగాణలో ఏం సాధించారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయన్న కేటీఆర్… ఈ 8 ఏళ్ల స్వల్ప కాలంలోనే నీటిపారుదల రంగంలో తెలంగాణ దేశానికే ఓ నమూనాగా మారిందని చెప్పారు. ఈ రంగంలో రాష్ట్రం ఉజ్వల స్థితికి చేరిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నీటి పారుదల రంగంలో ఐఏఎస్‌లకే పాఠాలు చెప్పే స్థాయికి ఎదగటమే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందన్నకేటీఆర్… దేశంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగ నియామకాలు జరిపిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కిందన్నారు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రూపొందించిన స్టడీ మెటీరియల్ ను మంత్రులు @KTRTRS, @SabithaindraTRS నేడు ఆవిష్కరించారు. pic.twitter.com/97ePqZ0CoO
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 27, 2022