గుజరాత్ పర్యటనలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భగవద్గీతలోని శ్లోకాన్ని తప్పుగా పలకడంపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. గుజరాత్ లో ఎలాగైనా పట్టు సాధించాలన్న ఉద్దేశంతో అరవింద్ కేజ్రీవాల్ విస్తృతంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే సూరత్ లోని ద్వారకాదీశ్ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తన పార్టీ గుర్తు చీపురును గుర్తు చేస్తూ.. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ట్రోలింగ్ జరుగుతోంది.
‘ధర్మస్య’కు బదులు ‘ధజ్’ అంటూ..
భగవద్గీతలోని ‘యధా యధాహి ధర్మస్య’ అనే శ్లోకాన్ని కేజ్రీవాల్ ప్రస్తావిస్తూ.. ‘యధా యధాహి ధజ్’ అని పలికారు. భూమిపై చెడు పెచ్చరిల్లినప్పుడల్లా భగవంతుడు తన చీపురుకు పని చెప్పాల్సి వస్తుండంటూ.. తమ పార్టీ గుజరాత్ లో చెడును ఊడ్చేసేందుకు వచ్చిందన్నట్టుగా కేజ్రీవాల్ మాట్లాడారు. అయితే శ్లోకాన్ని కేజ్రీవాల్ తప్పుగా పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విపరీతంగా కామెంట్లు వస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ శ్రేణులు, అభిమానుల నుంచి విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది.
‘‘ఎవరు వీరంతా.. ఎక్కడి నుంచి వస్తారు ఇలాంటి వారు’, ‘ఇలా శ్లోకం ఎవరు చెప్పారు? ఈయనకు ఎప్పుడు చెప్పారు..?’ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.
‘కేజ్రీవాల్ కు శ్లోకాలు తెలియకపోతే.. వాటిని పఠించకుంటే బాగుంటుంది. ధర్మాన్ని నిలబెట్టేందుకు భగవంతుడి చేతిలో పెట్టుకున్న సుదర్శన చక్రాన్ని.. చీపురు కట్టతో పోల్చవద్దు. ఆ దేవుడు మీకు కనీస జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం..” అంటూ పెద్ద సంఖ్యలో కామెంట్లు వస్తున్నాయి.