ఏలూరు జిల్లా పోలవరం మండలం గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములను, ఎల్.టి.ఆర్ భూములకు సాగు పట్టా ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న భూ సర్వే లో గిరిజనుల సాగులో ఉన్న భూములను కూడా నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం గిరిజన కమ్యూనిటీ హాల్ నుండి ఏటిగట్టు సెంటర్ వరకు ర్యాలీగా వచ్చి గిరిజనులు నిరసనలు తెలిపారు . ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్ని గిరిజన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి గిరిజనుల సాగులో ఉన్న భూములకు హక్కు పత్రాలు అందజేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఏ.రవి డిమాండ్ చేశారు. గిరిజన భూములకు హక్కు పత్రాలు ఇస్తానని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలి అన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలు నియంత్రించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు టి.రామకృష్ణ అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి హామీ పని దినాలు పెంచాలని, దినసరి కూలీ వేతనం 600 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యలపై నినాదాలు చేస్తూ పోలవరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సముద్రాల సాయి కృష్ణ, చలపతి గంగాదేవి, ధర్ముడు లక్ష్మి, మడకం వీరయ్య, ఆకుల దుర్గా తదితరులు పాల్గొన్నారు.
