తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా చరిత్రలో నిలిచిపోయిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్… తన దృష్టిని పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాల వైపు మళ్లించారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఏ పార్టీ కానీ, ఏ కూటమి కానీ ఎదుర్కోలేని పరిస్థితుల్లో… ఆయన జాతీయ పార్టీని ప్రకటించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి)గా మారుస్తున్నట్టు తెలిపారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగానే ఆయన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో కొత్త పార్టీని ప్రకటించారు. దీనికి సంబంధించిన తీర్మానంపై 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు సంతకం చేశారు. దాదాపు ఎనిమిది రాష్ట్రాలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయినట్టు తెలుస్తోంది.
ఈ సమావేశానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు కుమారస్వామి పూర్తి మద్దతును ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా కేసీఆర్ తో కలిసి తమ పార్టీ ఎమ్మెల్యేలందరూ తిరుగుతారని చెప్పారు.