భద్రాచలం, చర్ల : బంగారు తెలంగాణ చేస్తానని అధికారం లోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలేనని బిజెవైఎం విమర్శించింది. మంగళవారం చర్ల మండల బిజెవైఎం అధ్యక్షుడు రాచకొండ అనిల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బిజెవైఎం భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ నల్లూరి ఉదయభాస్కర రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు నిరుద్యోగ భృతి ఇస్తానని ముఖ్యమంత్రి కేసిఆర్ మోసం చేశారని ఆక్షేపించారు. హామీలు ఇచ్చి విస్మరించడం ముఖ్యమంత్రి నైజంగా మారిందని ఆరోపించారు. ఎన్నికల్లో హామీలు ఇవ్వడం ప్రజలని మభ్య పెట్టడం కెసిఆర్ కు ఆనవాయితీగా మారిందని దుయ్యబట్టారు. తెరాస ప్రభుత్వం నిరుద్యోగులను అన్ని విధాల మోసగించిదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత నిరుద్యోగులకు కనీసం ఉపాధి దొరకని దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎన్నికల హామీల గానే నిరుద్యోగ భృతి హామీను ఇచ్చి యువతను దగా చేసే కుట్రకు పాల్పడిందనేది అర్థమైందని ఆయన అన్నారు. రాష్ట్రంలో చదువుకున్న లక్షలాది నిరుద్యోగులు ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబ లబ్ధి కోసం కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యువతకు ఉద్యోగాలు, ఉపాధి కోసం ఖచ్చితమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం యువత కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని ఈ సందర్భంగా వివరించారు. లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ముద్ర రుణాల పంపిణీ ద్వారా ఎంతో మంది యువత చిరు వ్యాపారులకు ఉపాధి కల్పించిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. మిగులు బడ్జెట్ లోని రాష్ట్రాన్ని అప్పులు అవినీతిమయంగా చేసిన తెరాస ప్రభుత్వంపై యువత పెద్ద ఎత్తున పోరాటాలకు శ్రీకారం చుడుతుందని ఉదయ్ నల్లూరి అన్నారు. యువత జీవితాన్ని నాశనం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. సంక్షేమ పరమావధిగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విప్లవార్ధకమైన పథకాలకు ప్రజలు, యువత మద్దతు పలుకుతున్నారని ఉదయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నియంత పాలనకు వ్యతిరేకంగా యువజన మోర్చా భవిష్యత్తు పోరాటాలు సాగిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి నవీన్, దొంతు సాగర్ తదితరులు పాల్గొన్నారు.