contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మునుగోడు లో గెలిచేందుకు మూటలు తెచ్చి .. ముఠాలను దించారు : రేవంత్ రెడ్డి

మునుగోడు: మునుగోడు ఉపఎన్నికకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి నామినేషన్‌ దాఖలు చేశారు. చండూరు తహశీల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌ అలీ, సీతక్క తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… తెరాస, భాజపాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీకి కార్యకర్తలే ధైర్యం.. వారి అండతోనే ప్రజా సమస్యలపై పోరాడుతున్నాం. డబ్బులతో ఓటర్లను కొనుగోలు చేయాలని భాజపా, తెరాస చూస్తున్నాయి. మునుగోడు ప్రజలు అమ్ముడుపోవడానికి సిద్ధంగా లేరు. అమ్ముడు పోవడానికి కార్యకర్తలేమీ గుత్తేదారులు కాదు. వేలాది మంది కార్యకర్తలు మాకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నారు. దిండి ప్రాజెక్టు పూర్తి చేస్తే చివరి ఆయకట్టుకు నీళ్లందుతాయి. దిండి ప్రాజెక్టుకు రూ.5వేల కోట్ల ప్యాకేజీ ఇప్పించగలరా? భాజపా అభ్యర్థి ప్రాజెక్టులకు నిధులు తీసుకురాగలరా?

మునుగోడు పౌరుషాల గడ్డ..

మునుగోడు పౌరుషాల గడ్డ. భాజపా, తెరాస నాయకులు ముఠాలతో, మూటలతో ఓట్లు కొల్లగొట్టాలనుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు కొడంగల్‌ను దత్తత తీసకుంటున్నానని కేటీఆర్‌ చెప్పారు. కానీ, ఇప్పటివరకు అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మునుగోడు ప్రజలను కొడంగల్‌ తీసుకెళ్లి చూపిస్తా. నేను వేయించిన రోడ్లపై గుంతలు పడితే తట్టెడు మట్టివేసే దిక్కులేదు. రేపో మాపో మునుగోడుకు సీఎం కేసీఆర్‌ వస్తారు. కుర్చీ వేసుకొని ఇక్కడే కూర్చుంటా.. మునుగోడుకు సముద్రం తెస్తానని చెబుతారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఫామ్‌హౌస్‌కే పరిమితం అవుతారు. 2014లో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు.. మునుగోడులో ఏమైనా అభివృద్ధి జరిగిందా? చౌటుప్పల్‌కు డిగ్రీ కాలేజీ వచ్చిందా? రైతు రుణమాఫీ జరిగిందా? దిండి ప్రాజెక్టు పూర్తయిందా? మునుగోడు ప్రజలు విచక్షణతో ఆలోచించాలి.

మాయగాళ్ల వలలో పడొద్దు..

ఉప ఎన్నిక నియోజకవర్గ అభివృద్ధికి రాలేదు.. ఒక వ్యక్తి అమ్ముడు పోతే వచ్చింది. ఆ వ్యక్తి ధనదాహంతో కాంగ్రెస్‌ను తాకట్టుపెట్టి పార్టీని చంపేయాలని చూస్తున్నాడు. కన్న తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసి శత్రువు పంచన చేరాడు. నల్గొండ గడ్డది పోరాటాలు చేసిన చరిత్ర. చిన్న ముల్కనూరు, మూడు చింతలపల్లి, లక్ష్మపూర్‌ను కేసీఆర్‌ దత్తత తీసుకున్నారు. నిన్న నామినేషన్‌కు వచ్చిన డ్రామారావు దత్తత తీసుకుంటానని కబుర్లు చెబుతున్నారు. ఈ మాయగాళ్ల వలలో మునుగోడు ప్రజలు పడొద్దు. స్రవంతిని గెలిపిస్తే సమ్మక్క, సారక్కలా సీతక్కతో కలిసి అసెంబ్లీలో కొట్లాడుతారు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :