మునుగోడు: పాలకులు దోచుకున్న అవినీతి సొమ్మునంతా రాష్ట్రంలో నీలిరంగు జెండాను ఎగురవేసిన వెంటనే ప్రజలకు పంచుతామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.బహుజన రాజ్యాధికార యాత్ర నల్గొండ జిల్లా మునుగోడు మండలం కచిలపురం, జక్కలవారిగూడెం, రావిగూడెం,సోలిపురం గ్రామాల్లో సాగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తమ పార్టీకి ప్రజల ఆదరణ చూసి ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయం పట్టుకున్నందునే తెరాస తరఫున కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు,భాజపా తరఫున కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచార బాధ్యతలు తీసుకున్నారన్నారు. గతఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే మోసం చేశారని,మళ్లీ ఓట్ల కోసం ఎందుకు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మునుగోడు మండలం సోలిపురం గ్రామానికి బయలుదేరిన ప్రవీణ్‌కుమార్ నడుం లోతులో ప్రవహిస్తున్న వాగును నడుచుకుంటూ దాటి చేరుకున్నారు. ప్రమాదకరంగా ఉన్న వాగును దాటి గ్రామస్థులు ఎలా రాకపోకలు సాగిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.ఎన్నికలు రాగానే క్యాంపు కార్యాలయం కట్టుకున్న రాజగోపాల్‌రెడ్డికి,రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వాగుపై వంతెన వేయాలని గుర్తు రాలేదా అని ప్రశ్నించారు.