టెలీ మార్కెటింగ్, స్పామ్ కాల్స్ వేధింపులు ఎక్కువైపోయాయి. ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు ఇలాంటి కాల్స్ వస్తే చిర్రెత్తుకొస్తుంది. కొన్ని సందర్భాల్లో వీటి కారణంగా ముఖ్యమైన కాల్స్ మిస్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇప్పుడు మోసపూరిత కాల్స్ కూడా పెరిగిపోయాయి. వీటిని తమ ఫోన్లో బ్లాక్ చేసుకున్నా పెద్దగా ఉపయోగం ఉండడం లేదు. ఎందుకంటే ఫ్రాడ్ స్టర్స్, మార్కెటింగ్ వ్యక్తులు వందల సంఖ్యలో నంబర్లను ఉపయోగిస్తుంటారు. అందుకని వీటిని మొత్తంగా బ్లాక్ చేసుకోవడమే పరిష్కారం.
టెలికం రంగ నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’.. నేషనల్ కస్టమర్ ప్రిఫరెన్స్ రిజిస్టర్ ను నిర్వహిస్తోంది. గతంలో దీన్ని నేషనల్ డు నాట్ కాల్ రిజిస్ట్రీ (ఎన్ డీఎన్ సీ) అని పిలిచేవారు. డు నాట్ డిస్టర్బ్ కోసం ఫోన్ లో ఎస్ఎంఎస్ యాప్ ఓపెన్ చేసి.. START DND అని టైప్ చేసి 1909కు పంపించాలి. తర్వాత టెలికం సర్వీసు ప్రొవైడర్.. బ్యాంకింగ్, హాస్పిటాలిటీ తదితర ఆప్షన్లు, వాటి కోడ్స్ పంపిస్తారు. కోడ్ నంబర్ తో రిప్లయ్ ఇస్తే ఆయా కాల్స్ బ్లాక్ అయిపోతాయి.
24 గంటల్లో డీఎన్ డీ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు అనుచిత థర్డ్ పార్టీ కమర్షియల్ కాల్స్, ఎస్ఎంఎస్ లు నిలిచిపోతాయి. కానీ, బ్యాంకుల నుంచి ఖాతాదారులకు వచ్చే ఎస్ఎంఎస్ అలర్ట్ లు, ఆన్ లైన్ పోర్టళ్ల నుంచి వచ్చే ఎస్ఎంఎస్ లు, వాట్సాప్ తదితర థర్డ్ పార్టీ యాప్ ల నుంచి వచ్చే కాల్స్ ఆగవు. ఎందుకంటే అవి తమ కస్టమర్లకు పంపిస్తున్న ఎస్ఎంఎస్ లు కనుక.
జియో యూజర్లు మై జియో యాప్ లో, సెట్టింగ్స్ ను ఓపెన్ చేయాలి. అక్కడ కనిపించే డునాట్ డిస్టర్బ్ ఎంపిక చేసుకోవాలి. అక్కడ పలు కేటగిరీలు కనిపిస్తాయి. వాటి నుంచి కావాలనుకున్నది బ్లాక్ చేసుకోవచ్చు. ఎయిర్ టెల్ యూజర్లు ఎయిర్ టెల్ డీఎన్ డీ పోర్టల్ https://www.airtel.in/airtel-dnd/ కు వెళ్లి అక్కడ మొబైల్ నంబర్ ఇవ్వాలి. మొబైల్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. అక్కడ కనిపించే కేటగిరీల్లో కావాలనుకున్న వాటిని బ్లాక్ చేసుకోవాలి.
వొడాఫోన్ ఐడియా కస్టమర్లు https://www.myvi.in/dnd పోర్టల్ కు వెళ్లి బ్లాక్ చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు తమ ఫోన్ నుంచి START DND అని టైప్ చేసి 1909కు పంపించాలి. ఆ తర్వాత వచ్చే ఆప్షన్ల నుంచి ఎంపిక చేసుకుని రిప్లయ్ ఇవ్వాలి.