శ్రీనగర్: జమ్మూ- కశ్మీర్(Jammu Kashmir)లోని రాజౌరి జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది! ఓ సైనిక శిబిరం(Army Camp) వెలుపల జరిగిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు.మరొకరు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. గుర్తుతెలియని ఉగ్రవాదులు(Terrorists) ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు వెల్లడించారు. ఆర్మీకి చెందిన ‘వైట్ నైట్ కోర్'(White Knight Corps) ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. మరోవైపు.. ఈ ఘటనపై స్థానికులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. మిలిటరీ క్యాంప్‌పైకి రాళ్లు రువ్వారు. పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ.. అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. మృతులను రాజౌరికి చెందిన కమల్ కుమార్, సురీందర్ కుమార్‌గా గుర్తించారు. ఈ ఘటనలో ఉత్తరాఖండ్‌కు చెందిన అనిల్ కుమార్ గాయపడ్డాడు. అతడిని ఆర్మీ ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 6.15 గంటల ప్రాంతంలో పలువురు స్థానికులు విధుల కోసం ఆర్మీ క్యాంపు ఆల్ఫా గేటు వద్దకు వస్తుండగా కాల్పులు జరిగినట్లు వారు చెప్పారు. ఈ ఘటనను నిరసిస్తూ స్థానికులు వీధుల్లోకి వచ్చారు. పౌర హత్యలను ఖండిస్తూ సైనిక శిబిరంపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ.. జమ్మూ- పూంచ్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. మరోవైపు వారిని సముదాయించేందుకు సీనియర్ అధికారులు రంగంలోకి దిగారు. రాజౌరీ- పూంచ్ రేంజ్ డీఐజీ, రాజౌరీ డీసీలు ఘటనాస్థలికి చేరుకున్నారు.