ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పార్టీ ఆర్థికసాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ రూ.1 లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో, రేపు (డిసెంబరు 18) పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు. పవన్ రాక నేపథ్యంలో పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 200 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. వీరి కుటుంబాలకు సత్తెనపల్లి వేదికగా జరిగే కార్యక్రమంలో ఆర్థికసాయం చెక్కులు అందించనున్నారు. సత్తెనపల్లి మంత్రి అంబటి రాంబాబు సొంత నియోజకవర్గం అని తెలిసిందే. అయితే, ఈ నియోజకవర్గం నుంచి పలువురు నేతలు జనసేనలో చేరతారంటూ కథనాలు వస్తున్నాయి. రేపటి పవన్ సభలోనే ఈ చేరికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.