నరసాపురం వైసిపి ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏపీ హోం శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా చేసింది. తనపై ఉన్న కేసుల వివరాలు ఇవ్వాలంటూ రఘరామ హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ ను హైకోర్టు శుక్రవారం హైకోర్టు విచారించింది. ఎంపీపై ఉన్న ఎఫ్ఐఆర్లు, రిజిస్టర్ కాని ఫిర్యాదుల వివరాలు ఇవ్వాలని హోంశాఖను హైకోర్టు ఆదేశించింది. చట్టపరంగా తనకున్న హక్కులను ఉపయోగించుకునేందుకు రఘురామకు అవకాశం ఉందని ఈ సందర్భంగా న్యాయస్థానం అభిప్రాయపడింది. తనపై ఉన్న కేసుల వివరాలను ఇవ్వాలని డీజీపీకి లేఖ రాసినప్పటికీ స్పందన లేకపోవడంతో ఎంపీ రఘురామ హైకోర్టును ఆశ్రయించారు.
ఆయన తరఫున న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున హోం శాఖ న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే, నియోజకవర్గానికి వచ్చేందుకు అవకాశం ఇవ్వకుండా, రఘురామపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఉమేష్ చంద్ర హైకోర్టుకు తెలిపారు. ఉమేష్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. రఘురామకృష్ణపై ఉన్న ఎఫ్ఐఆర్లు, రిజిస్టర్ కాకుండా ఉన్న వివరాలు కూడా వెంటనే అందించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 19కి వాయిదా వేశారు.