ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ గ్రామం ప్రమాదకర రీతిలో భూమిలోకి కుంగిపోతుండడం పట్ల కేంద్రం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం నిన్న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర సీఎస్ ఎస్ఎస్ సంధు, డీజీపీ అశోక్ కుమార్ ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
జోషిమఠ్ గ్రామం వేగంగా భూమిలోకి కుంగిపోతుండడం, ఇళ్లకు పగుళ్లు వస్తుండడంపై చర్చించారు. ఎస్ఎస్ సంధు మాట్లాడుతూ, జోషిమఠ్ గ్రామాన్ని పరిశీలించిన నిపుణులు కూడా సమావేశంలో పాల్గొన్నారని వివరించారు. ఎవరికీ ఎలాంటి హాని జరగకూడదన్నదే తమ ఉద్దేశమని, ఆ దిశగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జోషిమఠ్ గ్రామం నుంచి ప్రజలను తరలిస్తామని, భూమి కుంగిపోవడానికి గల కారణాలను సత్వరమే తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. కేంద్రం నిపుణులతో మాట్లాడిందని, ఈ రోజు కూడా నిపుణుల బృందం జోషిమఠ్ గ్రామాన్ని సందర్శిస్తారని తెలిపారు.