ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందారు. ఈరోజు ఉదయం ఆయనకు గుండెపోటు రాగా… హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆసుపత్రికి వచ్చే సమయానికే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆయనను కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఆయన మరణించిన విషయాన్ని అపోలో వైద్యులు ఆయన భార్యకు సమాచారం అందించారు.
గౌతమ్ రెడ్డి మరణంతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వైసీపీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఆయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా అందరూ దిగ్భ్రాంతికి గురవుతున్నారు. 49 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన మరణించడం అందరిలో విషాదాన్ని నింపుతోంది.
వారం రోజుల పాటు దుబాయ్ పర్యటనను ముగించుకుని నిన్ననే ఆయన హైదరాబాదుకు వచ్చారు. దుబాయ్ ఎక్స్ పోలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే దిశగా పలు సంస్థలతో సంప్రదింపులు జరిపి, కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడే మేకపాటి గౌతమ్ రెడ్డి.