గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ లకు దీటుగా ఆమ్ ఆద్మీ పార్టీ బరిలో నిలిచింది. దాంతో, ఆ రాష్ట్రంలో ముక్కోణపు పోటీ నెలకొంది. ఈ సమయంలో ఆప్ పార్టీని ఇరకాటంలోకి నెట్టే అస్త్రం బీజేపీకి లభించింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ వ్యవహారమే ఇందుకు కారణం. హవాలా రాకెట్, మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనను మే 30వ తేదీన అరెస్టు చేసింది. అయితే, తీహార్ జైలులో ఆయనకు కొందరు సిబ్బంది మసాజ్ చేస్తున్న ఓ వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
బీజేపీ బయటపెట్టిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో, జైలులో ఉన్న వ్యక్తికి ఆప్ రాచమర్యాదలు చేయిస్తోందని బీజేపీ విమర్శలు గుప్తిస్తోంది. తీహార్ జైలులో సత్యేంద్ర జైన్ రాజభోగాన్ని అనుభవిస్తున్నారంటూ ఇదివరకే బీజేపీ నాయకులు పలుమార్లు ఆరోపించారు. తాజా వీడియోతో వారి చేతికి ఓ అస్త్రం చిక్కినట్టయింది. కేజ్రీవాల్ ప్రభుత్వమే దగ్గరుండి ఆయనకు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తోందంటూ మండిపడుతున్నారు. వీడియోపై స్పందించిన జైలు అధికారులు.. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకున్నారు.